ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు
భారీగా నగదు, బంగారం, ఆస్తి పత్రాల స్వాధీనం
హైదరాబాద్, జూన్ 10 (ఆధాబ్ న్యూస్): రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు సంబంధించిన సుమారు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.60 లక్షల నగదు, కిలోకు పైగా బంగారు ఆభరణాలు, 15 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా అధికారులు గుర్తించారు.
ఇంట్లో లభించిన మొత్తం బంగారం బరువు సుమారు మూడు కిలోల వరకు ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మోహన్ నాయక్ తన అధికార హోదాను అడ్డం పెట్టుకుని ఆర్అండ్బీ శాఖలో టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో భారీగా అక్రమ సంపాదన కూడబెట్టినట్లు చాలా కాలంగా ఫిర్యాదులు అందుతున్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఆయన ఆర్థిక లావాదేవీలపై కొంతకాలంగా రహస్య నిఘా కొనసాగించిన అనంతరం పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సోదాలు పూర్తయ్యే సరికి మోహన్ నాయక్ అక్రమ ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.









