కుంజా వనజ మృతి ఘటనపై డీపీహెచ్ డా. రవీందర్ నాయక్ ఆరా
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్ష
పాల్వంచ, జూన్ 20 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల సంచలనం సృష్టించిన కుంజా వనజ మృతి ఘటనపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డా. రవీందర్ నాయక్ ప్రత్యేకంగా ఆరా తీశారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల నుంచి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్, డీసీహెచ్‌ఎస్ డా. రవిబాబు, సంబంధిత వైద్య అధికారులు, ఆరోగ్య సిబ్బందితో సమావేశమైన డా. రవీందర్ నాయక్ గర్భిణికి అందించిన వైద్య సేవలు, చికిత్స విధానం, రిఫరల్ ప్రక్రియ, సంఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం సంబంధిత రికార్డులను పరిశీలించి, విధుల నిర్వహణలో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదికను త్వరితగతిన ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. మాతా-శిశు ఆరోగ్య సేవలు, కుటుంబ నియంత్రణ, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) స్క్రీనింగ్, టీకా కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల పనితీరు, సికిల్ సెల్ అనీమియా నియంత్రణ, క్షయవ్యాధి నిర్మూలన, కుష్ఠు నిర్మూలన, వెక్టర్ బోర్న్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై కార్యక్రమాల వారీగా సమీక్ష నిర్వహించారు.
ప్రతి కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని, పెండింగ్ అంశాలను వెంటనే పూర్తి చేయాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్య సంస్థల్లో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో రిఫరల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
మాతా-శిశు మరణాల నివారణకు ప్రతి ఆరోగ్య కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని, వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని డా. రవీందర్ నాయక్ దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా. తుకారాం రాథోడ్, డీసీహెచ్‌ఎస్ డా. రవిబాబు, ప్రోగ్రాం అధికారులు డా. ప్రతాప్, డా. ప్రసాద్, డా. దినేష్, మోహన్, రామ్ ప్రసాద్, విప్లవ్ కుమార్, సలిత, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.








