చిన్నారిపై దారుణానికి కఠిన శిక్ష విధించాలి: ఏజెన్సీ నేతకాని ప్రజా పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి శ్రీనివాసరావు
కరకగూడెం, జూన్ 13 (ఆధాబ్ న్యూస్): ఖమ్మం జిల్లా తల్లంపాడు ప్రాంతంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటనను ఏజెన్సీ నేతకాని ప్రజా పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. అభం శుభం ఎరుగని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం రెండో అంతస్తు నుంచి కిందకు నెట్టివేసిన నిందితుడు గౌస్ పాషాపై చట్ట ప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధిత చిన్నారికి మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను మరింత బలోపేతం చేసి, మహిళలు మరియు బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై వేగవంతమైన విచారణ జరిపి కఠిన శిక్షలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి దారుణాలకు పాల్పడే నేరస్థులకు ఉరిశిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వాలను కోరారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి న్యాయం చేయాలని ఏజెన్సీ నేతకాని ప్రజా పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.








