ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 15 (ఆధాబ్ న్యూస్): రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
విద్యాసంస్థల్లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాల ఆధారంగా పాఠశాలలను మూడు కేటగిరీలుగా విభజించి, వాటికి గరిష్ఠ ఫీజులను ఖరారు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రభుత్వం నిర్ణయించే నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలలు, కళాశాలలపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నెలలోనే కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిసింది.
విద్యార్థుల తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడం, ఫీజుల వసూళ్లలో పారదర్శకత తీసుకురావడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు వెల్లడించాయి.








