భద్రాచలంలో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్
39 వాహనాల స్వాధీనం
భద్రాచలం, జూన్ 6 (ఆధాబ్ న్యూస్): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవెన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం కాలనీవాసులతో సమావేశమైన డీఎస్పీ అరుణ్ కుమార్ పలు సూచనలు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని తెలిపారు. నేరాల నియంత్రణ కోసం నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించిన ఆయన, ప్రజలు తమ ప్రాంత సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు ఫోన్ చేసి పోలీసు సేవలను పొందవచ్చని తెలిపారు.
ఈ కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో సుమారు 90 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ అరుణ్ కుమార్, ఇన్స్పెక్టర్ నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్లు, సీఆర్పీఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్, స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ బృందం పాల్గొన్నారు.









