ఆర్చరీలో మెరిసిన ఆదివాసి ఆణిముత్యం – జాతీయ స్థాయికి అశ్విత్ దొర ఎంపిక
కరకగూడెం,ఆధాబ్,న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి యువ క్రీడాకారుడు కొమరం అశ్విత్ దొర ఆర్చరీ క్రీడలో ప్రతిభ చాటుతూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈనెల 26 నుండి 29 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా ట్రైబల్ జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు ట్రైబల్ క్రీడాకారులు ఎంపిక కాగా, వారిలో అశ్విత్ దొర చోటు దక్కించుకోవడం విశేషం.
అశ్విత్ దొర తాటిగూడెం గ్రామానికి చెందిన కొమరం వెంకటనారాయణ కుమారుడు. వెంకటనారాయణ భద్రాచలం ఐటిడిఏలో అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఆర్చరీపై ఆసక్తి చూపుతున్న అశ్విత్ దొర ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ అద్భుత ప్రతిభ కనబరిచి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అశ్విత్ దొరను తల్లిదండ్రులు, గ్రామస్తులు, క్రీడాభిమానులు మరియు ఆర్చరీ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే పోటీల్లో అశ్విత్ దొర మరింత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అడవుల మధ్య పెరిగిన ఒక ఆదివాసి యువకుడు తన కృషి, పట్టుదలతో జాతీయ స్థాయికి చేరుకోవడం స్థానిక యువతకు ప్రేరణగా నిలుస్తోంది.
Post Views: 302









