ఏపీ మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్: మావోయిస్ట్ టాప్ లీడర్ హిడ్మా సహా ఆరుగురు మృతి
ఎపి, ఆధాబ్ న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కీలక నేతలతో సహా ఆరుగురు నక్సల్స్ మృతి చెందినట్టు సమాచారం. గ్రే హౌండ్స్ దళాలు మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టి ఆపరేషన్ నిర్వహించగా, అక్కడ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా సహా పలువురు టాప్ కమాండర్లు హతమైనట్లు తెలిసింది. హిడ్మాతో పాటు అతని భార్య, డివిజనల్ కమిటీ సభ్యురాలు రాజే అలియాస్ రాజక్క, అలాగే దేవె, మల్ల అలియాస్ మల్లు, కమ్లు అలియాస్ కమలేష్, లక్మాల్ అలియాస్ చైతులు మృతి చెందిన వారిలో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం.
ఘటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అల్లూరి జిల్లా పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.










