లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో పర్యటించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
పెట్రోలింగ్‌ను మరింత బలపరచాలని ఆదేశాలు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: జిల్లాలో నేర నియంత్రణ, ప్రజా భద్రతపై దృష్టి సారించేందుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ, విధుల నిర్వహణపై పోలీస్ అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, స్టేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదగా, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
100 డయల్‌కు కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలని, ప్రజలకు వెంటనే సహాయం అందేలా స్పందన సమయాన్ని తగ్గించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. అదనంగా, పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
ప్రజలను సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించిన ఎస్పీ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న వృత్తిపరమైన లేదా వ్యక్తిగత సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.









