51.9 కిలోల గంజాయి పట్టివేత
కారు, బైక్ సీజ్ – ఇద్దరు అరెస్ట్ – మూడో వ్యక్తి పరారీలో
భద్రాచలం,ఆధాబ్ న్యూస్: ఒడిశా నుంచి కేరళకు కారు ద్వారా అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం పట్టుకుంది. భద్రాచలం కూనవరం క్రాస్ రోడ్ వద్ద నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ పట్టివేత జరిగింది.
ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై శ్రీహరి రావు సిబ్బంది కలిసి కారును ఆపి తనిఖీ చేయగా, కారు ఇంజన్‌లో దాచిన గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వాటిని తూకం వేయగా 51.9 కిలోల గంజాయిగా నమోదు అయింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు ₹26 లక్షలుగా అధికారులు అంచనా వేశారు.
అక్రమ రవాణాలో ఉపయోగించిన కారు, ఒక బైకును కూడా ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.
ఈ కేసులో కేరళకు చెందిన జకారియా పర్యాల్, నసిర పూర్తియా వేట్టల్లను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కందుల రవి (సూర్యాపేట) పరారీలో ఉన్నాడని వెల్లడించారు. అరెస్ట్ చేసిన ఇద్దరిని, స్వాధీనం చేసిన గంజాయి మరియు వాహనాలను భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ సీఐకి అప్పగించారు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ ఆపరేషన్ జరిగినట్లు ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ గణేష్ తెలిపారు. కేసు దర్యాప్తును ఏఈఎస్ కరం చంద్ చేపట్టనున్నారు.
భారీ మొత్తంలో గంజాయి పట్టివేతలో చురుకైన పాత్ర పోషించిన ఎక్సైజ్ సిబ్బందిని డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం అభినందించారు.









