కరకగూడెం జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతమైన జోడా యాత్ర
చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి – జేఏసీ రాష్ట్ర చైర్మన్ చుంచు రామకృష్ణ
కరకగూడెం, సెప్టెంబర్ 26 ఆధాబ్ న్యూస్ :(ప్రతినిధి)
కరకగూడెం మండలం జేఏసీ ఆధ్వర్యంలో ఆదివాసీ యువత ఉత్సాహంగా నిర్వహించిన జోడా యాత్ర ఘన విజయాన్ని సాధించింది. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా ఆదివాసీ సంఘాలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదివాసీ 9 తెగల జేఏసీ రాష్ట్ర చైర్మన్ చుంచు రామకృష్ణ ఏడుళ్లబయ్యారం క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకోగానే మండల జేఏసీ తరఫున ఘన స్వాగతం లభించింది. కలవలనాగారం గ్రామంలో మహిళలు సంప్రదాయ పద్ధతిలో మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. అనంతరం కొమరం భీంకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ, “అక్రమంగా వలస వచ్చి ఎస్టీ రిజర్వేషన్ పొందుతూ ఆదివాసీల హక్కులను దోచుకుంటున్న చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఈ ధర్మయుద్ధం ఆగదు. సెప్టెంబర్ 28న భద్రాచలంలో జరగబోయే భారీ బహిరంగ సభకు ప్రతి ఆదివాసీ స్వచ్ఛందంగా హాజరవ్వాలి” అని పిలుపునిచ్చారు.
ర్యాలీ భట్టుపల్లి, కొర్నవల్లి, చిరుమల్ల గ్రామాల గుండా ఉత్సాహంగా సాగింది. భట్టుపల్లిలో మండల ఉద్యోగ సంఘ నాయకులు రామకృష్ణకు పుష్పగుచ్చం అందించారు. కొర్నవల్లిలో యువత ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించారు. చిరుమల్లలో సమ్మక్క–సారలమ్మ గద్దె వరకు ర్యాలీగా వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. బర్లగూడెం, రఘునాథపాలెం గ్రామాల్లో సారలమ్మ, గాదెరాజు దేవతలను దర్శించి ర్యాలీని కొనసాగించారు.
ఈ జోడా యాత్రతో కరకగూడెం మండల ప్రజల్లో ఉత్సాహం, చైతన్యం నిండిందని పాల్గొన్న నాయకులు తెలిపారు. సెప్టెంబర్ 28న జరగబోయే *“ఛలో భద్రాచలం ధర్మయుద్ధ సభ”*ను విజయవంతం చేయాలని అందరూ గట్టిగా సంకల్పించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ చందా రామకృష్ణ, జేఏసీ నాయకులు కలం సంపత్, మాజీ సర్పంచులు పాయం నరసింహారావు, కొమరం విశ్వనాధం, ఉద్యోగ సంఘాల నాయకులు పోలేబోయిన కృష్ణయ్య, మలకం కుమారస్వామి, పోలేబోయిన మోహనరావు, మైపతి తిరుమలరావు, కొమరం అశోక్, పోలేబోయిన జయబాబు, విద్యార్థి నాయకులు పోలేబోయిన స్వామిప్రసాద్, ఇర్ప నాగకృష్ణ, కళ్యాణ్, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.









