నేరుగా విత్తే వరి సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఉప్పాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రైతులకు “నేరుగా విత్తే వరి సాగు – యాజమాన్య పద్ధతులు” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా KVK ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ భరత్ మాట్లాడుతూ –
“ఉప్పాకలో సుమారు 300 ఎకరాల్లో నేరుగా విత్తే వరి సాగు జరుగుతుండడం ఆనందదాయకం. నాటు వేసే విధానంతో పోలిస్తే ఈ పద్ధతిలో రైతులకు అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా కూలీ ఖర్చులు తగ్గి, ఎకరానికి సుమారు రూ.5,000 వరకు పెట్టుబడి ఆదా అవుతుంది” అని తెలిపారు.
అలాగే కలుపు నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ విధానంలో నీటి అవసరం తక్కువగా ఉండటంతో రైతులకు మరింత అనుకూలం అవుతుందని చెప్పారు. వరి పొలాల్లో అజోల్లా వాడకం వల్ల నత్రజని నేరుగా పంటకు అంది, యూరియా వినియోగాన్ని తగ్గించుకోవచ్చని కూడా రైతులకు వివరించారు.
కార్యక్రమంలో మణుగూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బి. తాతారావు, పినపాక ఎంఏఓ వెంకటేశ్వర్లు, హార్టికల్చర్ అధికారి శివ, ఎక్స్టెన్షన్ శాఖ హరిశ్చంద్ర, ఏఈఓలు కె. రమేష్, ఎస్. నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు తాతారావు మాట్లాడుతూ –
“భవిష్యత్తులో ఉప్పాక గ్రామం భద్రాద్రి జిల్లా రైతులందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను” అన్నారు.









