జానంపేట నిధుల గోల్‌మాల్‌పై హై లెవల్ కమిటీతో విచారణ జరపాలి
అధికార, ప్రతిపక్షాల ‘దొంగా-దొంగా’ ఆటలు సిగ్గుచేటు
నిజాయితీ పరులైతే అఖిలపక్షంగా కలెక్టర్‌ను కలుద్దాం : సీపీఐ, టీడీపీ నేతలు
పినపాక, జూన్ 26 (ఆధాబ్ న్యూస్): పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం, అవకతవకల ఆరోపణలపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి హై లెవల్ అధికారిక కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ, తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జానంపేటలో జరిగిన ఇరు పార్టీల ముఖ్య నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి తోగటి కుమార్, టీడీపీ మహబూబాబాద్ పార్లమెంట్ అధికార ప్రతినిధి మేదరమెట్ల శ్రీనివాసరావు, ధర్మరాజుల శంకర్ మాట్లాడుతూ… జానంపేట పంచాయతీ నిధుల వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య అని విమర్శించారు. 2018 నుంచి ఇప్పటి వరకు పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధులపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.
గతంలో సీపీఐ, టీడీపీ పాలకవర్గాలుగా ఉన్న సమయంలో ఎలాంటి మచ్చలేని పరిపాలన అందించామని, ప్రస్తుతం పంచాయతీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, రాబోయే రోజుల్లో ప్రజలే నిజానిజాలను బేరీజు వేసి తీర్పు చెబుతారని అన్నారు.
అలాగే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు నిజంగానే నిర్దోషులమని భావిస్తే పరస్పర ఆరోపణలు మానుకుని అఖిలపక్షంగా జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించి విచారణ కోరేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. త్వరలో మండల స్థాయిలో అఖిలపక్ష విస్తృత సమావేశాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ, టీడీపీ నాయకులు ఐలన్న, సాంబయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.








