ప్రాణాలు హరిస్తున్న పారాక్వాట్ గడ్డి మందుపై నిషేధం విధించండి: లోక్సభలో ఎంపీ రఘురాం రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ,ఆధాబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో పారాక్వాట్ అనే విషపూరిత గడ్డి మందు వలన అసంఖ్యాకంగా రైతులు, యువత జీవితాలను కోల్పోతున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిషేధం విధించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్సభ వర్షాకాల సమావేశాల్లో 377 నిబంధన కింద బుధవారం పట్టు పట్టారు.
పారాక్వాట్ మందు అత్యంత విషపూరితమైనదిగా, దీనికి విరుగుడు చికిత్స కూడా లేని నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేకమంది వ్యవసాయ కార్మికులు, యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
60కి పైగా దేశాల్లో నిషేధం విధించబడిన ఈ గడ్డి మందును మన దేశంలో ఇప్పటికీ వినియోగిస్తున్నారన్నది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ఆయన తెలిపారు. పర్యావరణానికి హానికరంగా ఉండే ఈ మందు అవశేషాలు గోధుమలు, పప్పుధాన్యాల్లో కూడా కనిపిస్తున్నాయని, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిందన్నారు.
ఈ విషయంలో కేంద్ర ఎరువులు, రసాయనాలు శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను ఎంపీ రఘురాం రెడ్డి కోరుతూ, పారాక్వాట్కు ప్రత్యామ్నాయాలను తీసుకురావడం, రైతులకు అవగాహన కల్పించడం కీలకమని సూచించారు. పారాక్వాట్ నిషేధంపై కేంద్రం తీసుకునే నిర్ణయాత్మక చర్య వ్యవసాయ రంగాన్ని రక్షించడంతో పాటు సమాజ గౌరవాన్ని నిలబెట్టగలదని ఆయన నొక్కి చెప్పారు.









