స్వచ్ఛ సర్వేక్షణ్–2025లో భాగంగా ఐదు రోజుల కార్యాచరణ అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
స్వచ్ఛ సర్వేక్షణ్–2025లో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు ఐదు రోజుల కార్యాచరణను క్రమబద్ధంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్, స్వచ్ఛత అంశంపై కీలక సూచనలు చేశారు.
ఈ సంద్భంగా
కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ముఖ్యపాత్ర వహిస్తుందని తెలిపారు. ప్రతి వారం ఐదు రోజుల కార్యాచరణను గ్రామాల్లో అమలు చేయాలని సూచించారు. ఈ కార్యాచరణ కింద ప్రతి రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఈ విధంగా వివరించారు:
సోమవారం – పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లోని పిచ్చిమొక్కలను తొలగించి ప్రజలకు ఉపయోగపడే మొక్కలు నాటాలని సూచించారు.
మంగళవారం – తడి చెత్త–పొడి చెత్త వేరు చేయడం వల్ల కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇకపై ప్రతి మంగళవారం, శుక్రవారం రోజుల్లోనే పొడి చెత్తను సేకరించాలని ఆదేశించారు.
బుధవారం – ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో పనికిరాని వస్తువులను తొలగించి, నీటి నిల్వలేమి ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని, అలాగే నీటి నిలువుదల ఉన్న ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు త్రవ్వాలని సూచించారు.
గురువారం – డ్రైనేజీల శుభ్రత, దోమల నివారణకు మందుల పిచికారీ, కమ్యూనిటీ మరుగుదొడ్ల శుభ్రతపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
శుక్రవారం – ప్రతి ఇంటి ఆవరణ శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.
సర్వేలో ఇండ్లలో మరుగుదొడ్ల వాడకం, తడి–పొడి చెత్త వేరు చేయడం, కంపోస్టు షెడ్ల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారిస్తారని వివరించారు. ఐదు రోజుల కార్యాచరణ ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతను బలోపేతం చేయడం సులభమవుతుందని చెప్పారు.
అలాగే, రానున్న బుధవారం లోపు ప్రతి గ్రామపంచాయతీలో మ్యాజిక్ సోక్ పిట్లు నిర్మించాల్సిందిగా సూచించారు. పిచ్చిమొక్కల నుండి వచ్చిన వ్యర్థాలతో బయోచార్ తయారు చేసి, దానిని మరుగునీటి శుద్ధి, దోమల నివారణకు ఉపయోగించవచ్చని తెలిపారు. ప్రతి గ్రామంలో ఏబీసీడి డ్రైవ్‌లు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని, వనమోత్సవ లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.









