మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ సింహాచలం…
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో మోతే సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహన ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, నీలాద్రిపేట గండి గ్రామానికి చెందిన కుంజా శివ అనే వ్యక్తి తన వ్యక్తిగత పనుల నిమిత్తం కరకగూడెం వైపు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మోతే వద్ద కోళ్ల ఫారం సమీపంలో వాహనాన్ని మితిమీరిన వేగంతో నడుపుతూ అదుపు తప్పడంతో రోడ్డుపై పడిపోయాడు. ప్రమాద సమయంలో శివ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్టు సమాచారం.
ఈ ప్రమాదాన్ని గమనించిన కానిస్టేబుల్ సింహాచలం, వినోద్ వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న శివను కరకగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ఈ ఘటనలో కానిస్టేబుల్ సింహాచలం చూపిన చొరవ, బాధితుడికి చేసిన సహాయం స్థానికుల్లో అభినందనీయంగా మారింది. , ఒక మానవతావాది కోణంలో స్పందించిన సింహాచలం నిండు ప్రాణాన్ని కాపాడిన వారధిగా నిలిచారు. పోలీస్ సేవలు కేవలం శాంతి కాపాడటానికి మాత్రమే కాకుండా, ప్రాణాలు కాపాడేందుకు కూడా ఎలా నిలుస్తాయో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది









