ఉచిత బస్సు ప్రయాణాలతో ఆటో డ్రైవర్ల జీవనం అగాధంలో పడిపోయింది – బత్తుల వెంకటేశ్వర్ రెడ్డి
పినపాక, జూలై 9 (ఆధాబ్ న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికుల బతుకులు అగాధంలో పడిపోయాయని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వారికి సహాయం చేయాలని తెలంగాణ జన సమితి పార్టీ పినపాక మండల అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
బుధవారం పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, ఉచిత బస్సు ప్రయాణ విధానం వల్ల ఆటో డ్రైవర్లకు ఆదాయం లేక జీర్ణ స్థితిలోకి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు పూట గడవని పరిస్థితుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు వారి పిల్లల విద్యా ఖర్చులను భరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూల్ ఫీజులు చెల్లించలేక ఆటో డ్రైవర్లు భార్యల తాళిబొట్లు తాకట్టు పెడుతున్నారనే పరిస్థితి ఏర్పడిందని, ఇది బాధాకరమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే, వారిలో ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
త్వరలోనే ఆటో యూనియన్ నేతలతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాముని కలవనున్నట్టు బత్తుల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.









