గోదావరి వరదలు – ముందస్తు చర్యలపై పినపాక మండల స్థాయిలో సమీక్షా సమావేశం
పినపాక, ఆధాబ్ న్యూస్:
వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో గోదావరి నదిలో వచ్చే వరదలతో పాటు స్థానిక వాగుల వలన ముంపు ప్రమాదానికి గురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలపై పినపాక మండల కేంద్రంలో బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. ఎంపీడీఓ సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఎంపీడీఓ సునీల్ కుమార్, ఇంచార్జ్ తహశీల్దార్ గోపాలకృష్ణ, ఏడూళ్లబయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎంపీవో వెంకటేశ్వరరావు తదితరులు కీలక సూచనలు చేశారు.
వారు మాట్లాడుతూ,
ముంపు ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి, నిర్వాసితులకు భోజన వసతులు సిద్ధం చేయాలని,
ఆరోగ్య శిబిరాలు, శానిటేషన్, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు.
బాధ్యత కలిగిన అధికారులు ఆయా గ్రామాల్లోనే బస చేస్తూ, సమస్యలను వెంటనే కంట్రోల్ రూమ్‌కు నివేదించాలి అని తెలిపారు.
అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం వ్యవహరించాలని, అప్రమత్తంగా ఉండకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించారు.
ఈ సమీక్షా సమావేశంలో అన్ని శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









