ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు – డయల్ 100 ద్వారా సహాయం పొందండి
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు. నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లే ప్రమాదం ఉండడంతో, రహదారులపైకి నీరు వచ్చి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రదేశాలకు వెళ్లడం వల్ల ప్రమాదాలు సంభవించవచ్చునని పేర్కొన్నారు. అలాంటి ప్రదేశాలకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు.
ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం, వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయ చర్యల కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ (DDRF) బృందాలను 24×7 అందుబాటులో ఉంచారు. జిల్లా పోలీసు శాఖ ఇతర శాఖలతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తూ, ప్రమాదకరమైన ప్రదేశాల్లో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది.
ప్రజలు ఏవైనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు శాఖ సేవలు పొందాలని ఎస్పీ సూచించారు. ప్రజల సహకారం అత్యంత అవసరం అని, పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.









