జులై 9, 10న ఆధార్ మెగా క్యాంపులు –జిల్లా కలెక్టర్ జితేష్ వి .పాటిల్ పిలుపు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆధార్ కార్డుల సవరణల కోసం జులై 9, 10 తేదీల్లో ప్రత్యేకంగా మెగా క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయం, నవభారత్, పాల్వంచలో ఈ క్యాంపులు జరగనున్నాయని పేర్కొన్నారు.
ఈ క్యాంపుల ద్వారా ప్రజలు తమ ఆధార్ డేటాలో ఉన్న తప్పులను సవరించుకోవచ్చు. ముఖ్యంగా పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, మొబైల్ నంబర్, ఫోటో, బయోమెట్రిక్ వివరాలు, తల్లిదండ్రుల పేర్లు వంటి అప్డేట్లు చేయించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
5 మరియు 15 ఏళ్ల వయస్సులో పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరైనదని, అలాగే 0–5 సంవత్సరాల చిన్నారుల ఆధార్ కార్డులో తల్లిదండ్రుల పేర్లు జతచేయవచ్చని ఆయన వివరించారు.
ఆన్లైన్ ద్వారా కొన్ని అప్డేట్లు (చిరునామా మార్పు లాంటివి) చేయవచ్చునని, కానీ మొబైల్ నంబర్, పుట్టిన తేది మార్పు వంటి సవరణలు మాత్రం ఆధార్ సేవా కేంద్రాలకే వెళ్లి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని వివరాల సవరణకు జీవితంలో ఒకే ఒక అవకాశం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కావున, ఆధార్లో ఏవైనా సవరణలు చేయించుకోవాలనుకునే వారందరూ తప్పకుండా ఈ మెగా క్యాంపులకు హాజరై తమ వివరాలను నవీకరించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.









