కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండప్రధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: రావుల సోమయ్య
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామం వద్ద నిర్మితమైన సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్–2 వద్ద జూన్ 30న సోమవారం జరగనున్న కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు రావుల సోమయ్య పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను సస్యశ్యామలం చేయాలని లక్ష్యంతో, రైతులకు మద్దతుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ప్రారంభించింది. 18 వేల కోట్ల రూపాయలతో 90 శాతం పనులు పూర్తి చేసిన తరువాత 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మిగిలిన 10 శాతం పనులపై అనవసరంగా ఆలస్యం చేస్తున్నది,” అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది పంప్ హౌస్ వద్ద హంగూ ఆర్భాటాలతో ప్రారంభోత్సవం చేసినా, ఆపై పనులు పూర్తిచేయకపోవడం ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యాన్ని వెల్లడించిందని విమర్శించారు.
ఇంకా మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు నీరు రాకుండా, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు తరలించడాన్ని చూస్తున్నాం. అక్కడ ఇప్పటికే సాగర్ జలాలు అందుబాటులో ఉండగా, ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వకపోవడం అన్యాయం,” అని అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వకపోతే, జూన్ 30న కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండ ప్రధాన అనంతరం ప్రతి రోజూ బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, సోషల్ మీడియా వారియర్లు పాల్గొన్నారు.









