చిన్నారులకు ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: 0–5 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఆధార్ నమోదు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. సమావేశం ఐడిఓసీ కార్యాలయంలో విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, తపాలా, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొనగా, సంబంధిత శాఖల సమన్వయంతో ఆధార్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ముఖ్య సూచనలు:
జిల్లాలోని ప్రతి మండలంలో ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయాలి.
5 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి.
ఆధార్ లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే గుర్తించి నమోదు చేయాలి.
పదేళ్ల క్రితం ఆధార్ పొందిన వారు తప్పనిసరిగా నవీకరణ చేసుకోవాలి.
విద్యా సంస్థలు, హాస్పిటళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.
కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలలో భాగస్వామ్యం కావాలంటే ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి.
అవసరమైన సేవల కోసం:
టోల్ ఫ్రీ నంబర్: 1947
ఈమెయిల్: help@uidai.net.in
ఆధార్ పై అభ్యంతరాలుంటే ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు కలెక్టరేట్ లో సంప్రదించవచ్చు.
ఈ సమావేశంలో హైదరాబాద్ రీజియన్ యుఐడీఏ అసిస్టెంట్ మేనేజర్ మొహ్మద్ సౌభాన్, ఆర్టీఓ మధు, జెడ్పీ సీఈవో చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఎల్డిఎం రామ్ రెడ్డి, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి, సెర్ప్ అదనపు డీఆర్డీవో రఘు కుమార్, జిల్లా మీసేవ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.









