సర్పంచ్, ఎంపీటీసీల లిస్టు ఇవ్వండి: మీనాక్షి నటరాజన్
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత, గ్రామస్థాయిలో పార్టీ పటిష్టతపై దృష్టిసారిస్తూ, పదవుల పంపకంపై కీలక అడుగులు వేస్తోంది. తొలుత ఆశావాహులైన నేతలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టిన పార్టీ, ఇటీవలే పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టి ముగ్గురికి క్యాబినెట్‌లో అవకాశం కల్పించింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం గాంధీ భవన్‌లో డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఆమె పలు అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.
గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనపై చర్చ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులతో పాటు కొన్ని మునిసిపాలిటీల పదవీకాలం ముగిసినట్లు నేతలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. 2024 ఫిబ్రవరిలోనే సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిందనీ, అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోందనీ తెలిపారు.
స్థానిక సంస్థల తర్వాతే మండల కాంగ్రెస్ నాయకత్వం
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మండల కాంగ్రెస్ నాయకత్వ నియామకాలను వెంటనే చేపడితే, పదవులు రాని వారు అసంతృప్తితో ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందని మీనాక్షి నటరాజన్ అభిప్రాయపడ్డారు. అందువల్ల, స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం మండల పార్టీ నియామకాలు చేపట్టడమే సమంజసమని ఆమె డీసీసీ అధ్యక్షులకు సూచించారు. దీనికి అధిక సంఖ్యలో నేతలు ఏకీభవించడంతో, ప్రస్తుతం నియామకాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
2017 నుంచి సర్పంచ్, ఎంపీటీసీల లిస్టు కోరించిన మీనాక్షి
ఇకపోతే, 2017 నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన లేదా పోటీ చేసిన సర్పంచ్‌లు, ఎంపీటీసీల లిస్టును త్వరగా అందజేయాలని మీనాక్షి నటరాజన్ డీసీసీ అధ్యక్షులు, పరిశీలకులను కోరారు. ముందుగా సిద్ధం చేసిన నలుగురి చొప్పున జాబితాలను కాకుండా, ప్రజాప్రతినిధుల ఆధారిత జాబితానే ఇవ్వాలని ఆమె స్పష్టం చేసినట్లు తెలిసింది.
సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం: మీనాక్షి నటరాజన్
కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి పని చేస్తోందని మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. “రాహుల్ గాంధీ మార్గదర్శనంలో, సమాజంలో ఎవరి వాటా వారికే” అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి పదవిలోనూ సామాజిక న్యాయం పాటించామని, పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు.
గ్రామ స్థాయిలో పటిష్టతే లక్ష్యం: టీపీసీసీ
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం పటిష్టంగా సాగాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. మండల, జిల్లా కమిటీలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర పరిశీలకులు, కో-ఆర్డినేటర్లు సమర్థంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. “జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత తెలంగాణకు దక్కిందని తెలిపారు.









