ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జూన్ 21, 22 తేదీల్లో నిజామాబాద్‌లో టి యు సి ఐ రాష్ట్ర మహాసభలు – విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపు

జూన్ 21, 22 తేదీల్లో నిజామాబాద్‌లో టి యు సి ఐ రాష్ట్ర మహాసభలు – విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపు

మణుగూరు,ఆధాబ్ న్యూస్: ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) రాష్ట్ర మహాసభలను ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్‌లో విజయవంతంగా నిర్వహించేందుకు కార్మికులు, సంఘాల నాయకులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి కోరారు. శుక్రవారం మహాసభల ప్రచార భాగంగా పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించి, సింగరేణిలోని వివిధ శాఖల్లో కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, టి యు సి ఐ అనేక పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన నిలుస్తోందని చెప్పారు. తెలంగాణలో టి యు సి ఐ ఏర్పాటు అయిన తరువాత సింగరేణి, కేజీబీవీ, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, ఆటో, మోటార్, హోటల్, బీడీ, హమాలీ, మధ్యాహ్న భోజన వంటవారులు, బిల్డింగ్ వర్కర్స్, విద్యుత్, హాస్పిటల్ వంటి అనేక రంగాల్లో కార్మికుల సమస్యలపై ఉద్యమం కొనసాగుతోందని వివరించారు.

జూన్ 21న భారీ కార్మిక ప్రదర్శన, 22న ప్రతినిధుల మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మహాసభలకు టి యు సి ఐ ఆల్ ఇండియా అధ్యక్షులు అమ్రిష్ పటేల్ హాజరుకానున్నారని, జిల్లాలోని సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే విధానాలను అమలు చేస్తున్నదని, కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి 8 గంటల పని దినం, సంఘం ఏర్పాటు హక్కు, సమ్మె చేయు హక్కులను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని పేర్కొన్నారు. హక్కుల కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదని, బలమైన కార్మికోద్యమ నిర్మాణం అవసరమని తెలిపారు.

ఈ సమావేశంలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ అధ్యక్షులు వి. జానయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!