ప్రభుత్వ బడి మీద నమ్మకంతో కుమార్తెను MPPS ముత్తారపుకట్ట పాఠశాలలో చేర్చిన ఉపాధ్యాయ దంపతులు
గుండాల,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ఊకె కృష్ణ, రామేశ్వరి దంపతులు తమ కుమార్తె ఊకె నమశ్వితను ఈ రోజు ముత్తారపుకట్ట గ్రామంలోని MPPS ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతిలో చేర్పించారు. ఇవేరు ఇల్లందు మండలం మశివాగు గ్రామానికి చెందినవారు.
గత విద్యా సంవత్సరం వరకూ ఖమ్మంలోని కార్పొరేట్ పాఠశాలలో చదువుతోన్న నమశ్వితను, ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం విశేషం. ఉపాధ్యాయులుగా పని చేసే ఈ దంపతులు—కబ్బాకుల రవి, అరెం రవికుమార్ లాంటి అంకితభావంతో, క్రమశిక్షణతో, నాణ్యమైన బోధన అందించే ఉపాధ్యాయుల పనితీరును గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊకె కృష్ణ తెలిపారు.
“ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరగాలన్న ఉద్దేశ్యంతోనే, మాకు కార్పొరేట్ స్కూళ్లో చదివించే సామర్థ్యం ఉన్నా కూడా మా కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం,” అని ఆయన స్పష్టం చేశారు. సుశిక్షితులైన ఉపాధ్యాయుల వల్ల అన్ని వర్గాల పిల్లలకు గుణాత్మక విద్య అందుతుందని, ఇప్పటి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు గణనీయంగా మెరుగైపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్బంగా ముత్తారపుకట్ట మాజీ సర్పంచ్ మంకిడి కృష్ణ మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలలు తిరిగి పూర్వవైభవం అందుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు మార్గదర్శకంగా నిలుస్తాయి. అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతున్నాం,” అన్నారు.
ఊకె కృష్ణ, రామేశ్వరి దంపతుల నిర్ణయాన్ని ముత్తారపుకట్ట గ్రామస్తులు, ఉపాధ్యాయులు కబ్బాకుల రవి, అరెం రవికుమార్, అంగన్వాడి టీచర్ ఈసం అంజమ్మ ప్రశంసించారు. వారు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.









