సింగరేణి పరిధిలో యువతకు ఉద్యోగం పేరుతో న్యాయానికి గండి: కర్నె బాబురావు ఆగ్రహం
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
సింగరేణి సంస్థ పరిధిలోని ఎస్ఎంఎస్ ప్లాంట్, ఓబీ కంపెనీల్లో స్థానిక భూ నిర్వాసిత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోందని సామాజిక సేవకులు కర్నె బాబురావు ఆరోపించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కనపెట్టి కొందరు అధికారులు రాజకీయాల ప్రభావంతో పనిచేస్తున్నారని విమర్శించారు.
ఉన్నతాధికారుల ఆదేశాలకూ విలువ లేకుండా…
సింగరేణి CMD, జిల్లా కలెక్టర్‌లు ఇచ్చిన ఆదేశాలను స్థానిక అధికారులు పట్టించుకోకుండా ఉద్యోగాల కోసం బహిరంగ ముడుపులు వసూలు చేస్తున్నారని బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎస్ఎంఎస్ ప్లాంట్‌లో పదహారు మందికి ఏ ప్రమాణాలపై ఉద్యోగాలు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
“కాసులు చెల్లిస్తేనే నౌకరి”: కాంట్రాక్టర్ల అగడాలు
కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లు నిరుద్యోగుల నుండి భారీగా డబ్బులు తీసుకుంటున్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయని బాబురావు తెలిపారు. ముఖ్యంగా ఓ సూపర్వైజర్‌కు పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదన్నారు. “ఆయన చెప్పిందే వేదం” అన్నట్టుగా ఆయన ముద్ర వేసిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారని విమర్శించారు.
రెండు సంస్థల్లో ఉద్యోగం: నాయకుడి ద్వంద్వ పాత్ర
ఓ కార్మిక సంఘం నాయకుడు ఒకేసారి రెండు చోట్ల కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మిగిలిన నిరుద్యోగ యువతకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో ఇది తీవ్రంగా ఆవేదన కలిగించే విషయమని అన్నారు.
ప్రశ్నించిన వారిపై బెదిరింపులు
ఇలాంటివి ప్రశ్నించిన వారిపై సదరు వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాబురావు డిమాండ్ చేశారు. రాజకీయ నేతల సూచనల మేరకే ఉద్యోగాలు ఇస్తున్నారన్న ఆరోపణలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాజమాన్యం స్పందించకపోతే ఉద్యమమే దారి
స్థానిక జీఎం వెంటనే స్పందించి భూ నిర్వాసిత యువత, మాజీ ఉద్యోగుల వారసులు, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో యువతతో పాటు భూ నిర్వాసితులతో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు హెచ్చరించారు.









