ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి భారత మాజీ ప్రధాని పేరు

కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి భారత మాజీ ప్రధాని పేరు

హైదరాబాద్‌,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మైనింగ్ కళాశాలకు మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
భారతదేశానికి ప్రధానిగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థికవేత్తగా విశేష సేవలు అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుతో ఈ విశ్వవిద్యాలయాన్ని పేరుపెట్టి రాష్ట్రం మరో గౌరవాన్ని చొరవగా సంపాదించుకుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే ఈ నిర్ణయంతో జిల్లా ప్రజల్లో ఆనందోత్సవ వాతావరణం నెలకొంది.
300 ఎకరాల్లో విశ్వవిద్యాలయం… దేశంలో అరుదైన స్థానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్ ఇప్పటికే 300 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఉన్నది. ఈ కళాశాల ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీగా మారనుంది. ప్రపంచంలో అమెరికాలో మాత్రమే ఉన్న ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ తరహాలోనే ఇది రెండవది కావడం విశేషం.

ఈ విశ్వవిద్యాలయం జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ లాంటి విభాగాల్లో UG, PG, Ph.D కోర్సులను అందించనుంది. అలాగే మైనింగ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగాల్లో B.Tech కోర్సులు అందుబాటులో ఉంటాయి. మొత్తం 780 సీట్లతో విద్యార్థులకు అవకాశాలు కల్పించనుంది.
మంత్రి తుమ్మల కృషికి కితాబు

ఈ యూనివర్శిటీ ఏర్పాటులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత్ర కీలకమైంది. ఆయన కృషితోనే మైనింగ్ కళాశాల నుంచి యూనివర్శిటీ స్థాయికి ఈ సంస్థ ఎదగగలిగింది. అభివృద్ధిలో తనదైన ముద్ర వేసే నేతగా తుమ్మల ఇప్పటికే ఖమ్మం ప్రజల్లో విశేష విశ్వాసాన్ని సంపాదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన నాయకత్వం కీలకం అయ్యింది.

ఉపాధికి కొత్త ద్వారాలు… యువతకు భవిష్యత్తు పటములో వెలుగు

ఈ యూనివర్సిటీ ద్వారా ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగనున్నాయి. భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా తయారయ్యే అవకాశాలు కలుగనున్నాయి. సహజ వనరుల అధ్యయనం, పరిశోధనలతో పాటు భౌగోళిక శాస్త్రంలో అభ్యాసానికి ఇది కేంద్రంగా మారనుంది.
అన్ని సదుపాయాలు.. దేశ స్థాయిలో గుర్తింపు

విశ్వవిద్యాలయానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

నేషనల్ హైవే సమీపం

మినీ స్టీల్ ప్లాంట్, ఫెర్రో అలాయ్స్, విద్యుత్ ప్లాంట్లు

ఐటీసీ, హెవీ వాటర్ ప్లాంట్

20 కి.మీ. దూరంలో ప్రతిపాదిత ఎయిర్ పోర్ట్

రైలు, రోడ్డు మార్గాలు

35 కి.మీ. దూరంలో గోదావరి నది

ఈ అనుకూలతలతో భవిష్యత్తులో ఈ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా విద్యా రంగంలో గొప్ప ఖ్యాతిని సంపాదించనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!