లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు తృటిలో తప్పిన ప్రమాదం
ఖమ్మం, ఆధాబ్ న్యూస్:
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టింది. అయితే సకాలంలో డ్రైవర్ అప్రమత్తమవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉండగా, వారికి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ కొంతకాలం ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమన్వయం చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ప్రమాదానికి కారణమైన వాహనాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, ప్రాథమిక చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.









