ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి
కేంద్ర కమిటీకి చెందిన నాయకుడి మృతి, భారీ ఆయుధాల స్వాధీనం
బీజాపూర్,ఆధాబ్ న్యూస్:
బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ సింహాచలం, గౌతమ్ మృతి చెందారు. సుదీర్ఘకాలంగా పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సుధాకర్‌పై ప్రభుత్వంగా రూ. కోటి రివార్డు ప్రకటించబడింది.
ఇటీవల మావోయిస్టు అగ్రనాయకుడు నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో, నెలరోజుల వ్యవధిలోనే పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగలడమే కాకుండా, సీనియర్ నేతలను కోల్పోవడం గమనార్హం. బీజాపుర్ జిల్లా ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సీనియర్ మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్ బలగాలు సమీకృత ఆపరేషన్ నిర్వహించాయి. తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో సుధాకర్ మృతి చెందినట్టు సమాచారం.
బీజాపుర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించినప్పటికీ, అధికారికంగా సుధాకర్ మృతిపై ప్రకటన వెలువడలేదు. అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
సుధాకర్‌కు గౌతమ్, ఆనంద్, చంటి బాలకృష్ణ రామరాజు, సోమన్న వంటి మారు పేర్లు ఉన్నాయి. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. గత నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో సుధాకర్ చురుకుగా పాల్గొంటూ వచ్చారు. 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో కూడా ఆయన భాగస్వామి అయ్యారు.
ఇక మరోవైపు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మావోయిస్టు మాజీ ప్రెస్ ఇన్‌ఛార్జి బండి ప్రకాశ్ మరియు స్పెషల్ జోన్ కమిటీ సీనియర్ లీడర్ పాపారావు కూడా అదే ప్రాంతంలో ఉన్నారని బస్తర్ ఐజీ పి. సుందర్ రాజు తెలిపారు. ప్రకాశ్ దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల నియామకాలు, ప్రచార కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నాడు. అతడిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. పాపారావు గెరిల్లా యుద్ధతంత్ర నిపుణుడిగా మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. అతడిపై రూ.20 లక్షల రివార్డు ఉంది.
తాజా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన ముగ్గురు కీలక నేతలు ఆరునెలల వ్యవధిలో భద్రతా బలగాల చేతిలో మృతి చెందడం, పార్టీకి పెద్ద దెబ్బగా భావించబడుతోంది.









