రామప్ప ఆలయానికి ప్రపంచ సుందరిమణుల సందర్శన – అపూర్వ ఘన స్వాగతం
ములుగు, ఆధాబ్ న్యూస్: ములుగు జిల్లాలోని విశ్వ ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయం మరోసారి ఆధ్యాత్మిక మహోత్సవానికి వేదికైంది. ప్రపంచ సుందరిమణులు రామప్ప ఆలయానికి చేరుకోవడంతో దేవాలయ ప్రాంగణం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. జిల్లాలోని అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘన స్వాగత కార్యక్రమాలు నిర్వహించాయి.
ప్రపంచ సుందరిమణులను రాష్ట్ర మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరిష్, టూరిజం శాఖాధికారులు, స్థానిక అధికారులు ఘనంగా స్వాగతించారు. గుస్సాడీ నృత్య ప్రదర్శనలతో పాటు ఒగ్గు కథలతో కళాకారులు సంస్కృతి సంప్రదాయాన్ని చూపిస్తూ అతిథులకు ఆహ్లాదకరమైన స్వాగతం పలికారు.
ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన అనంతరం సుందరిమణులు తమ చేతులతో కాళ్లు కడుక్కొని భక్తిశ్రద్ధలతో దేవతా దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలతో వారికి ఆలయ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టతలను సుందరిమణులు ఆసక్తిగా తెలుసుకున్నారు.
పురాతన శిల్ప కళాకృతులతో అలరారే ఈ రామప్ప ఆలయం అందాన్ని ఆస్వాదిస్తూ, దీని వైభవానికి మంత్ర ముగ్ధులయ్యారు. ఆలయ ప్రత్యేకతలు ఫొటోలు తీసుకుంటూ మెచ్చుకోవడమే కాదు, భారత సంప్రదాయానికి ఓ మహోన్నత ఉదాహరణగా అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క కూడా పాల్గొని సుందరిమణులతో మాట్లాడారు. వారిని ఆత్మీయంగా పలకరించడంతోపాటు, రామప్ప ఆలయం గురించి వివరించారు. ఈ సందర్శనతో రామప్ప ఆలయం గ్లోబల్ టూరిజంలో మరింత ప్రాచుర్యం పొందనుంది.









