మద్యం మాఫియా మార్మోగుతోంది… ఏజెన్సీలో అడ్డగోలు దందాపై కర్నే బాబురావు ఆగ్రహం
పినపాక, ఆధాబ్ న్యూస్:
ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో మద్యం మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని, ప్రభుత్వ నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని సామాజిక సేవకులు కర్నే బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, లక్షల రూపాయల విలువైన మద్యం నిల్వలు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు మాఫియాతో చేతులు కలిపి కోట్ల రూపాయల లాభాలు గడించేందుకు అక్రమంగా దందా సాగిస్తున్నారని ఆరోపించారు.
ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు… అధిక ధరలకు మద్యం
ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువ ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, కిరాణా దుకాణాల్లోనూ కావాల్సిన మద్యం బ్రాండ్లు సులభంగా లభిస్తున్నాయని చెప్పారు. నియోజకవర్గంలోని గ్రామాలు, మండల కేంద్రాలలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయని తెలిపారు. పగలు రాత్రి తేడా లేకుండా వీటిలో మద్యం విక్రయాలు బహిరంగంగానే జరుగుతున్నాయని అన్నారు.
అధికారుల నిర్వాహక వైఫల్యం
మద్యం నియంత్రణ కోసం ఉన్న ఎక్సైజ్, ప్రత్యేక అమలుదళాల అధికారులు తమ బాధ్యతలు నిర్వహించడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ప్రజలు ఫిర్యాదుల కోసం ఎక్సైజ్ కార్యాలయాలను ఆశ్రయించినా అక్కడ అధికారులు అందుబాటులో ఉండరని, ప్రశ్నిస్తే ‘‘మాకు తెలియదే! మా దృష్టికి రాలేదే!’’ అంటూ అమాయకంగా నటిస్తున్నారని అన్నారు.
సామాజిక దుష్పరిణామాలపై ఆందోళన
బెల్ట్ షాపుల వల్ల మద్యపానం వినియోగం పెరిగిపోతోందని, కుటుంబాల్లో కలహాలు, అప్పులు, మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని కర్నే బాబురావు ఆందోళన వ్యక్తం చేశారు. యువత మద్యానికి బానిసలవుతూ ఆర్ధికంగా, శారీరకంగా నష్టపోతున్నారని అన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
బెల్ట్ షాపులపై నియంత్రణ కల్పించి, నిబంధనలు పాటించని మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని, ప్రజల ఫిర్యాదులకు స్పందించేలా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని మద్యం అక్రమ దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు.









