సింగారం పంచాయతీలో తాగునీటి సంక్షోభం
సాయి నగర్ వాసుల గుక్కెడు నీటికోసం నరకయాతన
మణుగూరు, మే 13 , ఆధాబ్ న్యూస్: భయంకరమైన వేసవి ఒత్తిడిలో సమితి సింగారం పంచాయతీలోని సాయి నగర్ వాసులు తాగునీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే మంచినీటి పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో మహిళలు బిందెలు పట్టుకుని మైళ్లు దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమీ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. పంచాయతీ, మండల స్థాయి అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై స్పందించిన సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి మాట్లాడుతూ, “గ్రామంలో నీటి కొరత తీవ్రమవుతోంది. అధికారులు స్పందించకపోవడం బాధాకరం. కనీసం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం కూడా మరిచిపోయారు,” అని అన్నారు.
“ప్రతి రాత్రి నల్లాలు వస్తాయేమోనని ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రజలు పనులు మానేసి నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. అయినా అధికారులు చలించడంలేదు,” అని ఆయన విమర్శించారు. పంచాయతీకి ప్రత్యేక అధికారి ఉన్నా, గ్రామస్థుల గోస పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రవి తెలిపారు, తాగునీటి సమస్యపై ఫోన్ చేసినా అధికారులు స్పందించడంలేదని, బాధితులు ఎవరిని సంప్రదించాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. “ఇదే తీరును కొనసాగిస్తే, ప్రజలతో కలిసి పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతాం,” అని హెచ్చరించారు.
జిల్లా అధికారుల జోక్యం అవసరం
ప్రస్తుతం గ్రామంలో నీటి సరఫరాకు అవసరమైన వనరులు ఉన్నా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కర్నె రవి మండిపడ్డారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.









