పోస్టల్, బ్యాంకింగ్ సేవల్లో నిర్లక్ష్యం – అధికారులు తక్షణ చర్య తీసుకోవాలని సిపిఎం డిమాండ్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: మండలంలోని పలు ప్రాంతాల్లో పోస్టల్ శాఖ సేవలు నెలల తరబడి నిలిచిపోతున్నాయని, ఉత్తరాలు సకాలంలో రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం మండల కన్వీనర్ కొమరం కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఉన్న ప్రతి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లో బ్యాంకింగ్, పోస్టల్ సేవలు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాన్ని అధికారాలు తక్షణమే పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు.
పోస్టల్ సిబ్బంది తీర్పు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో నెలలుగా ఉత్తరాలు ప్రజల వద్దకు చేరకపోవడం వలనే అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.
“ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తరాలు అందకపోవడం వలెనే చాలా మంది అవకాశాలను కోల్పోతున్నారు. ప్రజలకు అందుబాటులో లేని పోస్టల్ సేవలు కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి,” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పోస్టల్ శాఖపై అధికారులు తనిఖీలు చేయాలని, ప్రతి పంచాయితీలో పోస్టల్ మరియు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయా లేదో తేల్చాలని కోరారు. సమస్యను పరిగణనలోకి తీసుకోకుండా నిర్వికారంగా వ్యవహరిస్తే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.









