జూలై నెలాఖరులోపు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 1 (ఆధాబ్ న్యూస్): మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను జూలై నెలాఖరులోపు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
సోమవారం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పనుల పురోగతిని అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జూన్ నాటికి పూర్తికావాల్సిన పనులు ఇంకా ఎందుకు పూర్తికాలేదని అధికారులను ప్రశ్నించారు. పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, పెండింగ్ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
పినపాక నియోజకవర్గ రైతులే సీతారామ ఎత్తిపోతల పథకం కోసం తొలుత భూములు అందించారని గుర్తు చేసిన మంత్రి, ఈ ప్రాజెక్టు ద్వారా మొదటగా పినపాక రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, సాగునీటి వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఇప్పటివరకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో రైతులకు ప్రయోజనం చేకూర్చాలంటే మరో రూ.9 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని చెప్పారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి ఇప్పటికే రూ.4 వేల కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కాలువల నిర్మాణం, భూసేకరణ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేస్తే వచ్చే ఏడాది నాటికి పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
అలాగే, ఖమ్మం జిల్లాలోని సుమారు ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే 38 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లోని విస్తారమైన ఆయకట్టుకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువను పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని, మట్టి పేరుకుపోయిన ప్రాంతాలు, జారిన గట్లు, ఇతర అవరోధాలను వెంటనే తొలగించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. రైతులకు సాగునీరు సకాలంలో అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మారెళ్లపాడు సర్పంచ్ మర్రి సంధ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









