ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

 

ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం, మే 29 (ఆధాబ్ న్యూస్): జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా అధికారులు కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన పోలీసు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కేసుల విచారణలో జాప్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించిన ఎస్పీ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. నిర్లక్ష్యంగా పనిచేసే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గంజాయి హాట్‌స్పాట్లను గుర్తించి రవాణాదారులతో పాటు వినియోగదారులపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమానితులకు గంజాయి రాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్ మోసాల బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి వారికి అండగా నిలవాలని తెలిపారు. డయల్-100కు వచ్చే ఫిర్యాదులపై కూడా వేగంగా స్పందించాలని ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించిన ఎస్పీ, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్తో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్