కరీంనగర్‌లో భూప్రకంపనలు రిక్టర్ స్కేల్– 3.8 తీవ్రతగా నమోదు.
కరీంనగర్,ఆధాబ్ న్యూస్: సోమవారం సాయంత్రం కరీంనగర్ జిల్లా అనేక ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించినట్లు సమాచారం.
ప్రధానంగా చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. కొన్ని సెకన్లపాటు భూమి ఊగిపోవడం గమనించగా, ఇళ్లలో ఉన్నవారు బయటకు పరుగులు పెట్టారు. కొన్ని చోట్ల గోడలు, కిటికీలు స్వల్పంగా కంపించినట్టు స్థానికులు తెలిపారు.
భూప్రకంపనలతో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్టు ఇప్పటి వరకు సమాచారం లేదు. భూకంపానికి కారణాలపై అధికారుల నుండి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే అప్డేట్ చేయబడతాయి.









