52 సీట్ల బస్సులో 100 నుంచి 130 మంది ప్రయాణం
కరకగూడెం మండల ప్రజలకు నిత్యం నరకయాతన
కరకగూడెం, జూలై 1 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని గిరిజన ప్రాంత ప్రజలు రంగాపురం-మణుగూరు ఆర్టీసీ బస్సులో ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 52 సీట్ల సామర్థ్యం ఉన్న ఆర్డినరీ బస్సులో రోజూ 100 నుంచి 130 మంది వరకు ప్రయాణికులు కిక్కిరిసిపోయి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
రంగాపురం, కరకగూడెం, పినపాక, బయ్యారం తదితర గ్రామాల ప్రజలకు మణుగూరు వెళ్లేందుకు ఇదొక్కటే ప్రధాన బస్సు సౌకర్యంగా ఉండటంతో బస్సులో తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. ఉదయం 10 గంటలకు రంగాపురం నుంచి బయలుదేరాల్సిన బస్సు తరచూ ఆలస్యంగా వస్తుండటంతో మణుగూరు చేరుకునే సమయానికి మధ్యాహ్నం 12 గంటలు దాటిపోతుందని ప్రయాణికులు వాపోతున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు తమ పనులకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
బస్సులో మహిళలు, విద్యార్థులు నిలబడేందుకు కూడా స్థలం లేక ఒకరిపై ఒకరు పడుతూ ప్రయాణిస్తున్నారని, చిన్న పిల్లలతో పాటు గిరిజన మహిళలు గంటల తరబడి నిలబడి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పినపాకలోని కళాశాలలకు వెళ్లే విద్యార్థులు మొదటి తరగతులు కోల్పోతున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో రంగాపురం-మణుగూరు రూట్లో ఉదయం 11 గంటలకు అదనపు బస్సు నడపడంతో పాటు, ప్రస్తుతం ఉన్న బస్సును సకాలంలో ఉదయం 10 గంటలకు నడిపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని

కోరుతున్నారు.








