కూలి పనికి వెళ్లి ప్రమాదం.. ప్రాణాపాయ స్థితిలో ఇర్ప క్రిష్ణ
కుటుంబ పోషణ కోసం వెళ్లి ప్రమాదం.. ఆసుపత్రిలో జీవన్మరణ పోరాటం చేస్తున్న కూలీ
ధాన్యం లోడు పనిలో విషాదం.. తలకు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఇర్ప క్రిష్ణ
పేద కుటుంబంపై విధి విరుచుకుపాటు.. చికిత్స కోసం దాతల సహాయం కోరుతున్న కుటుంబం
రోజువారీ కూలీకి ఘోర ప్రమాదం.. రూ.3 లక్షలు ఖర్చైనా కొనసాగుతున్న చికిత్స
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమత్‌మోతే గొల్లగూడెం గ్రామానికి చెందిన ఇర్ప క్రిష్ణ తీవ్ర ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. రోజువారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన కుటుంబ పోషణ కోసం కొత్తగూడెం వెళ్లి ధాన్యం లోడు తరలించే పనిలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో అకస్మాత్తుగా వర్షం రావడంతో ట్రాక్టర్‌పై ఉన్న ధాన్యం లోడు మీద వేసిన పట్టాలు తడిసిపోవడంతో, లోడు పైన కూర్చున్న ఇర్ప క్రిష్ణ జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమై వెంటనే స్పృహ కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన Maxcare Hospital లో చికిత్స పొందుతున్నారు.
వైద్యుల సమాచారం ప్రకారం బ్రెయిన్‌లో రక్తస్రావం (బ్లడ్ క్లాట్) ఏర్పడటంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు అప్పులు చేసి, ఉన్న ఆస్తులు అమ్ముకుని సుమారు రూ.3 లక్షలకు పైగా వైద్య ఖర్చులు చేసినప్పటికీ ఇంకా చికిత్స కొనసాగించాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజూ కూలి పనులపై ఆధారపడే ఈ కుటుంబానికి ప్రస్తుతం వైద్య ఖర్చులు భారంగా మారాయి. కుటుంబ పెద్ద ఆసుపత్రి మంచంపై ప్రాణాలతో పోరాడుతుండగా భార్య, పిల్లలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మంచి మనసున్న వారు స్పందించి సహాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
సహాయం కోసం ఫోన్‌పే నంబర్: 9390043324 (ఇర్ప కుశేలుడు)









