ఖాకీకి అవినీతి మకిలి.. ఏసీబీ వలలో బోధన్ ఎస్సై
ఆధాబ్ న్యూస్ బోధన్ :
నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై చిత్తన్నొజు భాస్కర చారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు.
ఒక క్రిమినల్ కేసులో ఫిర్యాదుదారుడి బంధువు పేరును చేర్చకుండా ఉండేందుకు మొదట రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన ఎస్సై, చివరకు రూ.7 వేలకే ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. బుధవారం పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదుదారుడి నుంచి రూ.7 వేల నగదును స్వీకరిస్తుండగా ముందస్తు సమాచారంతో వల పన్నిన ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి రసాయన పరీక్షలో పాజిటివ్‌గా తేలిన లంచం నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్సైను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
రక్షక భటుడే భక్షకుడిగా మారి అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.









