రైతులపై కాంగ్రెస్ పార్టీ వివక్షత: రావుల సోమయ్య
ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలి – BRS డిమాండ్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ :రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని BRS పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య డిమాండ్ చేశారు.
ఆదివారం కరకగూడెం BRS పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో BRS ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.10,000 రైతుబంధు, రూ.5 లక్షల రైతుభీమా, 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ వంటి పథకాలను అమలు చేసిందని గుర్తుచేశారు.
ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా రైతుబంధు నిధులను ఆలస్యం చేస్తోందని, రైతు బోనస్ ఇవ్వడం లేదని, అలాగే ఒడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కౌలు రైతులకు రూ.12,000 ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కూడా రైతులను మోసం చేయడమేనన్నారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకులు రైతుల సమస్యలను పట్టించుకోకుండా కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని, లేదంటే రైతుల తరఫున ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులకు BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ ఉపాధ్యక్షులు పోగు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బుడగం రాము, మాజీ సర్పంచ్ ఊకె రామనాధం, బైరిశెట్టి చిరంజీవి, ఏళ్ళు రామకృష్ణ రెడ్డి, రావుల కనకయ్య, పాయం నరసింహారావు, కొమరం విశ్వనాథం, చందా పాపారావు తదితరులు పాల్గొన్నారు.








