సైబర్ మోసగాళ్ల వలలో జనగామ ఎమ్మెల్యే… లక్ష రూపాయలు కోల్పోయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: సైబర్ మోసాలు సాధారణ ప్రజలకే కాకుండా ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదని మరోసారి రుజువైంది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ మోసగాడి వలలో పడి లక్ష రూపాయలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే… “వికసిత్ భారత్” పేరుతో ఒక వ్యక్తి ఎమ్మెల్యేను సంప్రదించాడు. అర్హుల జాబితా పంపిస్తే ఒక్కొక్కరికి రూ.10 లక్షల రుణాలు అందిస్తామని నమ్మబలికాడు. దీనికి ప్రాసెసింగ్ ఫీజుగా ఒక్కొక్కరికి రూ.2,500 చెల్లించాలని సూచించాడు.
ఈ మేరకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మొత్తం రూ.1 లక్షను ఫోన్‌పే ద్వారా ఆ వ్యక్తికి పంపించారు. అయితే, తర్వాత మరింత డబ్బులు అడగడంతో అనుమానం కలిగి మోసం జరిగినట్లు గుర్తించారు.
తక్షణమే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాడిని గుర్తించే పనిలో ఉన్నారు.
ఈ ఘటనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తుల మాటలకు నమ్మకం ఉంచి డబ్బులు పంపకూడదని హెచ్చరిస్తున్నారు.








