నకిలీ బంగారు ఆభరణాలతో బ్యాంకును మోసం చేసిన ముగ్గురు అరెస్ట్
రూ. 9.53 లక్షల రుణాలు దోచుకున్న ఘటన వెలుగులోకి
కల్లూరు, ఏప్రిల్ 2 (ఆధాబ్ న్యూస్):
నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ. 9 లక్షలకు పైగా రుణాలు పొందిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖ మేనేజర్ కె.వి. ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. విచారణలో భాగంగా 2024లో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేసిన శ్రీపాది సతీష్ (A1), శ్రీపాది మౌనిక (A2 – పరారీ), రామచంద్రోజు జయమ్మ (A3), రామచంద్రోజు నరేష్ (A4)లు కలిసి కుట్ర పన్ని సుమారు 242.25 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా చూపించి తాకట్టు పెట్టి రూ. 9,53,000 విలువైన రుణాలు పొందినట్లు గుర్తించారు.
తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఆ ఖాతాలు నిరర్థక ఆస్తులుగా (NPAs) మారాయి. అనంతరం బ్యాంకు అధికారులు వేలం ప్రక్రియ చేపట్టగా, తాకట్టు పెట్టిన ఆభరణాలు నకిలీవని బయటపడింది.
ఈ కేసులో నిందితులైన శ్రీపాది సతీష్, రామచంద్రోజు జయమ్మ, రామచంద్రోజు నరేష్‌లను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న శ్రీపాది మౌనిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇటువంటి మోసపూరిత చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.









