రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారుల సమీక్ష
వి.ఎం.బంజర్,ఆధాబ్ న్యూస్:
రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వి.ఎం.బంజర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న హాట్‌స్పాట్లను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆధ్వర్యంలో అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సైట్ ఇంజనీర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు, సిఐ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్‌ను పరిశీలించిన అధికారులు, గ్రీన్ ఫీల్డ్ హైవే వైపు వెళ్లే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు సర్వీస్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రహదారులు స్పష్టంగా కనిపించే విధంగా రోడ్డు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తొలగించే చర్యలు చేపట్టారు.
అనంతరం “అరైవ్ అలైవ్ క్యాంపెయిన్” మూడవ దశలో భాగంగా వి.ఎం.బంజర్ రింగ్ సెంటర్‌లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఆటో యూనియన్ సభ్యులు, దుకాణదారులు మరియు ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ వసుంధర యాదవ్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి బాధ్యతాయుతంగా వాహనం నడపడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కుటుంబాలు క్షేమంగా ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంపై దృష్టి పెట్టాలని, ముఖ్యంగా మహిళలు తమ భర్తలు, కుమారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని సూచించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా కల్లూరు డివిజన్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లు ఇతర శాఖలతో కలిసి “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. సూచిక బోర్డుల ఏర్పాటు, రహదారులపై గుంతలను పూడ్చడం, చెత్తాచెదారాన్ని తొలగించడం వంటి దిద్దుబాటు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.









