మహబూబాబాద్ పోలీస్ శాఖలో ఎస్పీ శబరీష్ కఠిన చర్యలు – అవినీతి అధికారులపై గట్టి వేట
మహబూబాబాద్,మార్చి 31 ఆధాబ్ న్యూస్:
మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో అవినీతి నిర్మూలనకు జిల్లా ఎస్పీ శబరీష్ కఠిన చర్యలు ప్రారంభించారు. ఇటీవల పలువురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల (సి.ఐ.) బదిలీలతో ప్రారంభమైన ఈ చర్యలు, శాఖలో పెద్ద ఎత్తున ప్రక్షాళనకు దారి తీస్తున్నాయి.
ఇప్పటికే జరిగిన బదిలీలు కేవలం ఆరంభమేనని, త్వరలోనే ఎస్.ఐలు, రైటర్లు, హెడ్ కానిస్టేబుళ్లపై కూడా చర్యలు ఉండొచ్చని సమాచారం. స్టేషన్లలో అక్రమాలకు పాల్పడుతూ, పైరవీకారులతో చేతులు కలిపి ప్రజలను ఇబ్బంది పెట్టే సిబ్బంది జాబితా ఎస్పీ కార్యాలయానికి చేరినట్లు తెలిసింది.
ఎస్పీ శబరీష్ “పని చేసే వారికి పూర్తి మద్దతు ఉంటుంది.. తప్పు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా, క్షేత్రస్థాయిలో నిఘా పెంచినట్లు తెలిపారు.
స్టేషన్లకు వచ్చే సాధారణ ప్రజలకు న్యాయం జరగాలని, అవినీతికి ఎలాంటి స్థానం ఉండకూడదని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అవినీతి అధికారుల్లో ఆందోళన నెలకొంది.
మొత్తానికి, ఎస్పీ శబరీష్ చేపట్టిన ఈ ప్రక్షాళన చర్యలు జిల్లా పోలీస్ శాఖలో క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా, ప్రజల్లో నమ్మకాన్ని బలపరుస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.









