దర్జాగా ఇటుక బట్టీల దందా – ప్రజలు వాయుకాలుష్యంతో ఇబ్బందులు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండలంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న ఇటుక బట్టీల వల్ల సమీప గ్రామాల ప్రజలు తీవ్ర వాయుకాలుష్య సమస్యను ఎదుర్కొంటున్నారని సామాజిక సేవకుడు కర్నె బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్, ఐటిడిఏ పీవోకు ప్రజావాణిలో ఫిర్యాదు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు లేకుండానే ఇటుక బట్టీలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయని, దీనివల్ల మొండికుంట, తుమ్మల చెరువు, సర్వాయిపాడు బంజర, గొల్లగూడెం, సీతారాంపురం గ్రామాల్లో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయ పంటలు నష్టపోతుండగా, గాలిలో బూడిద, పొగ వల్ల పర్యావరణం తీవ్రంగా కాలుష్యానికి గురవుతోందన్నారు.
ఇటుక బట్టీలలో వలస కార్మికులతో శ్రమదోపిడీ జరుగుతోందని, చిన్నపిల్లలతో పని చేయించడం ద్వారా బాల కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. రహదారుల పక్కనే బట్టీలు ఉండటంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతి లేని ఇటుక బట్టీలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాబురావు కోరారు.









