సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం
పేషెంట్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరార్
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్: సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ హల్‌చల్ చేయడంతో కలకలం రేగింది. ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, ఆమె వద్ద ఉన్న సుమారు పది తులాల బంగారాన్ని తీసుకుని పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం ప్రకారం, ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. డిశ్చార్జ్ చేసే సమయంలో యాప్రాన్ ధరించిన ఓ మహిళ డాక్టర్‌లా నటిస్తూ రోగి గదిలోకి వెళ్లింది. ముందుగా చికిత్స చేయాల్సి ఉందని చెప్పి, పేషెంట్ బంధువులను గది బయటకు వెళ్లమని సూచించింది.
కొద్దిసేపటి తర్వాత బంధువులు గదిలోకి వెళ్లి చూడగా సుధారాణి స్పృహ కోల్పోయి ఉండటాన్ని గమనించారు. అదే సమయంలో ఆమె ధరించిన సుమారు పది తులాల బంగారం కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తమైంది. వెంటనే ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యానికి తెలియజేశారు. అయితే గదిలోకి వచ్చిన మహిళ ఎవరో తమకు తెలియదని యాజమాన్యం సమాధానం ఇచ్చినట్లు బంధువులు తెలిపారు.
దీంతో బాధిత కుటుంబ సభ్యులు మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యాప్రాన్ ధరించిన మహిళ నర్సింగ్ స్టాఫ్ రూమ్ ప్రాంతంలో కనిపించినట్లు సమాచారం. తెలిసిన వ్యక్తి చేశాడా లేక బయటి వ్యక్తి చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.









