ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు గురుకులంలో ఆహార విషబాధ ఘటన – హెచ్‌ఎంను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్

మణుగూరు గురుకులంలో ఆహార విషబాధ ఘటన – హెచ్‌ఎంను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్

మణుగూరు, మార్చి 10, ఆధాబ్ న్యూస్:
మణుగూరు పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఆహార విషబాధ ఘటన చోటుచేసుకుని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో మొత్తం 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, అందులో 22 మందిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను SFI, PDSU, DSFI విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి భయ్య అభిమన్యు, PDSU జిల్లా కార్యదర్శి డి. ప్రణయ్, PDSU జిల్లా అధ్యక్షుడు వి. విజయ్, DSFI జిల్లా కన్వీనర్ సిహెచ్ చరణ్లు విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

తదుపరి వారు వసతి గృహానికి చేరుకుని CRO, RCO అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వసతి గృహంలో వండిన మాంసం లేదా టిఫిన్ కారణంగా ఆహారం విషపూరితం కావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు.

సంఘటన జరిగిన తర్వాత కూడా వసతి గృహ సిబ్బంది తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం ఇచ్చారని, ఆసుపత్రిలో ఉన్న విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపించారు. అసలు విషయాన్ని దాచిపెట్టేందుకు వివిధ కారణాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఈ ఘటనపై పూర్తిస్థాయి న్యాయ విచారణ జరిపి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గురుకుల హెచ్‌ఎంను తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించాయి.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయని, మరో నాలుగు రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోందని వారు తెలిపారు. ఈ పరిస్థితుల్లో అధికారులు విద్యార్థులు, తల్లిదండ్రులకు నమ్మకం కల్పించే చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో SFI జిల్లా ఉపాధ్యక్షుడు మాదాసు అఖిల్, నాయకులు నిరజ్, మనోజ్, తేజ, PDSU నాయకులు సిద్దు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!