ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గ్రామ భవిష్యత్తు కోసం మద్యపానంపై కఠిన చర్యలు మద్యపాన నిషేధం కోసం పోలీసులకు వినతిపత్రం సమర్పించిన వెంకటాపురం గ్రామ నాయకులు

గ్రామ భవిష్యత్తు కోసం మద్యపానంపై కఠిన చర్యలు
మద్యపాన నిషేధం కోసం పోలీసులకు వినతిపత్రం సమర్పించిన వెంకటాపురం గ్రామ నాయకులు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో వెంకటాపురం గ్రామపంచాయతీ నాయకులు మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరుతూ పోలీసు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గ్రామ సర్పంచ్ చౌలం కేశవరావు, ఉపసర్పంచ్ ఈసం కోటేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పెరుగుతున్న మద్యపాన ప్రభావం కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశంలో మద్యపాన నిషేధంపై తీర్మానం ఆమోదించినట్లు తెలిపారు.

గ్రామ పరిధిలో ఎవరైనా మద్యం విక్రయం చేయడం లేదా అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడితే వారికి రూ.25,000 జరిమానా విధించాలని గ్రామపంచాయతీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే అక్రమ మద్యం విక్రయాలను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించేందుకు సహకరించిన వారికి ప్రోత్సాహకంగా రూ.2,000 నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

గ్రామంలో మద్యం విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మద్యపానాన్ని పూర్తిగా అరికట్టాలని నాయకులు పోలీసు అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!