తెలంగాణలో జనాభా లెక్కల సేకరణకు సన్నాహాలు – మే 11 నుంచి మొదటి దశ ప్రారంభం
హైదరాబాద్,మార్చి 4 ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలో 2026–27 జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. మొదటి దశలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, కట్టడాల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు మంగళవారం సాయంత్రం సెక్రటేరియట్లో అన్ని శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జనాభా లెక్కల విభాగం రాష్ట్ర సంచాలకురాలు భారతి హోళికెరితో కలిసి ఇళ్ల లెక్కింపు ప్రక్రియపై సమగ్రంగా చర్చించి అధికారులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
ఈసారి జనాభా లెక్కల సేకరణలో కీలక మార్పు చోటు చేసుకోనుంది. దేశ చరిత్రలో తొలిసారిగా ఈ ప్రక్రియను పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో డేటా సేకరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ను వినియోగించనున్నారు.
జనాభా లెక్కల సిబ్బంది తమ స్మార్ట్ఫోన్ల ద్వారా నేరుగా వివరాలను నమోదు చేయనున్నారు. దీంతో సమాచారం వేగంగా, కచ్చితత్వంతో కేంద్రీకృత వ్యవస్థకు చేరుతుందని అధికారులు తెలిపారు.
ఇక ప్రజలు తమ వివరాలను తామే నమోదు చేసుకునే విధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ (Self-Enumeration) సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆన్లైన్ నమోదు ప్రక్రియ మే 11కి 15 రోజుల ముందు ప్రారంభమవుతుందని సీఎస్ కే. రామకృష్ణారావు వెల్లడించారు.









