మల్లేపల్లి గోదావరిలో ఇద్దరు గల్లంతు.. గాలింపు చర్యలు కొనసాగుతున్న పోలీసులు
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
మణుగూరు మండలంలోని మల్లేపల్లి ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. హోలీ పండుగ సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు వ్యక్తులు గల్లంతైన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది.
మల్లేపల్లి ప్రాంతంలోని సింగరేణి వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న గోదావరి నదిలో మంగళవారం మధ్యాహ్నం స్నానానికి దిగిన ఇద్దరు యువకులు ఆకస్మాత్తుగా నీటిలో కనిపించకుండా పోయారు. వారితో వచ్చిన స్నేహితులు వెంటనే స్థానికులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.
అగ్నిమాపక సిబ్బంది, ఈతగాళ్లు సహాయంతో గోదావరిలో విస్తృతంగా శోధన కొనసాగుతోంది. గల్లంతైన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హోలీ సందర్భంగా నదుల్లో స్నానం చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతైన ప్రాంతాల్లోకి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.









