కరకగూడెం మండలంలో ఘనంగా బాలా మేళా
కరకగూడెం,మార్చి 2 ఆధాబ్ న్యూస్ :విద్యార్థుల ప్రాథమిక అభ్యాస నైపుణ్యాల అభివృద్ధి, సృజనాత్మక ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా కరకగూడెం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి బాలా మేళా కార్యక్రమం ఘనంగా జరిగింది.
మండలంలోని వివిధ ప్రాథమిక పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థుల కోసం రాత పరీక్షలు, కథలు చెప్పడం, చదవడం, గణిత నైపుణ్యాల ప్రదర్శనతో పాటు పలు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించబడినవి.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి జి మంజుల మాట్లాడుతూ, బాలా మేళా వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నేర్చుకునే ఆసక్తిని పెంపొందించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. భట్టుపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టి మోహన్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు చూపిన ప్రతిభ ప్రశంసనీయమని, జిల్లా స్థాయిలో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
అనంతారం కాంప్లెక్స్ ఇంచార్జ్ వసంత్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడిందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదలకు దోహదపడతాయని పేర్కొన్నారు.
పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
మండల రిసోర్స్ పర్సన్స్ జె వెంకటేశ్వర్లు, కే సూర్యనారాయణ, భావ్ సింగ్, రమేష్, తిరుమల రావు, కీర్తి వర్ధన్, రఘు, ఉపాధ్యాయులు శ్వేత, సుమతి, లీల ప్రవీణ, విజయనందిని, రమాదేవి, స్వాతి, ఆట యూనియన్ నాయకులు కుమారస్వామి, వినోద్, గిరి, శ్రీనివాస్, అశోక్, సిఆర్పిలు సాంబశివరావు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.









